బీజింగ్ ని కుదిపేసిన భారీ వర్షాలు

Deadly rains batter China capital as new storm looms. చైనా రాజధాని బీజింగ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి.

By Medi Samrat  Published on  2 Aug 2023 2:45 PM IST
బీజింగ్ ని కుదిపేసిన భారీ వర్షాలు

చైనా రాజధాని బీజింగ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 27 మంది గల్లంతైనట్లు తెలిపింది. గత కొద్దిరోజులుగా బీజింగ్ లో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఒక్క బీజింగ్ నగరంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. హెబీ ప్రావిన్సులో మరో 9 మంది మరణించారు. బీజింగ్ లో అనేక ఇళ్లు నీట మునిగాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదలకు 5 లక్షల మంది ప్రజలు ప్రభావితులైనట్లు స్థానిక మీడియా నివేదించింది. జులై 28 నుంచి చైనాపై తుఫాను ప్రభావం చూపించింది. జులై 31 న కురిసిన భారీ వర్షాలు బీజింగ్ నగరం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. బీజింగ్‌లోని మెంటౌగౌ జిల్లాలో రైలు స్టేషన్‌లో, చుట్టుపక్కల చిక్కుకుపోయిన ప్రజలకు సైన్యం ఆహార ప్యాకెట్లను అందజేసింది. బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌతో సహా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.

Next Story