హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనకు ఎలాంటి నోలీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని చెప్పారు. అలాగే మీడియా సమక్షంలోనే అధికారులపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు.
అంతేకాకుండా తాను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదని.. ఇప్పటికీ కాంప్రమైజ్ కాలేదు.. కాను కూడా అని తెలిపారు. వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను వెనక్కి తగ్గలేదని చెప్పారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లు కూలుస్తానంటే ఊరుకునేది లేదు, హైడ్రా విషయంలోనూ వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు. ఇక తన ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని, ఇంట్లో లీడర్ల ఫొటోలు ఉంటే తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్లు తన అభిమానులని ఎవరి అభిమానం వాళ్లకి ఉంటుందని దానం వ్యాఖ్యానించారు.