కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా? అసలు బ్యానర్‌లో బీఆర్ఎస్ అని ఉంటుందా? టీఆర్ఎస్ అని ఉంటుందా?..అని ప్రశ్నించారు.
కాగా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. కాంగ్రెస్ కుల గణన ఫలితమే బీఆర్ఎస్ పార్టీ బీసీ అధ్యక్షుడిగా నియమిస్తోంది..అని జోస్యం చెప్పారు.
కేటీఆర్ మళ్లీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలను స్మరించుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్‌కు లేవడమే చేత కావడం లేదు.. ముఖ్యమంత్రి అయ్యి చేసేదేముంది.? భారీ డైలాగులు కొట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కళ్ల ముందు జరిగిన చరిత్రను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు. గాంధీ, నెల్సన్ మండేలా లాగా కేసీఆర్ ఫీల్ అవుతున్నారు..అని ఎంపీ చామల సెటైర్లు వేశారు.