కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik
కార్యకర్తలను బావ బామ్మర్దులు రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుంది..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసే పత్రికలు, టీవీ ఛానెళ్లపై దాడులకు ఉపక్రమించడం సరికాదు. ఉద్యమ సమయంలో తరహాలో తిరిగి సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. బావ బామ్మర్దులు టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్ల గురించే రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు అని.. వాళ్ల గురించి అనుకూలంగా చూపించే టీవీ ఛానెల్ తెలంగాణ ఛానెల్ అని.. తెలంగాణలో బీఆర్ఎస్ గురించి ఎవరు నెగిటివ్‌గా మాట్లాడిన, రాసినా ఆంధ్ర ఛానెల్ అంటున్నారు..అని ఎంపీ చామల వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఎన్‌టీఆర్ దగ్గర బీఫామ్ కోసం అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అనే పేరును తారక రామారావుగా మార్చుకున్నారు. కానీ ఏపీ, తెలంగాణ మధ్య వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ సిటీలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ స్నేహితులంతా ఆంధ్ర వాసులే, ఆయన తిరిగిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మిత్రులందరూ ఆంధ్ర వాళ్ళే. కేటీఆర్ చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో, విజ్ఞాన్ కాలేజీలో చదివి జ్ఞానం లేని మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు...అని ఎంపీ చామల విమర్శించారు.
మేము హైదరాబాద్‌ని గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నాం. ఒక మంచి రైసింగ్ తెలంగాణ స్లోగన్‌తో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోంది. కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద టీవీ ఛానల్ మీద చూపిస్తున్నారు. పదేళ్ల మీ అధికారం గురించి ..ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి చెడు ప్రచారం గురించి ఛానల్ చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని ,చెడును రెండింటిని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అది కాకుండా దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని మాట్లాడడం సరికాదు...అని ఎంపీ చామల కిరణ్ కుమార్ పేర్కొన్నారు.