బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు.? ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ ఆఫీస్ లేదు.. కోకాపేట్‌లో బీఆర్ఎస్‌కు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలన్నారు. భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి వాడాలని సూచించారు. బీఆర్ఎస్‌కు ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ.. దానికి కూడా మేమే భూమి ఇచ్చామన్నారు.
పార్టీలో చేరికల మీద బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మట్లాడుతున్నారు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..? శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా మీరు తొలగించలేదా..? మా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా..? అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను అంగడి బజారులో పెట్టారని.. తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.