బీఆర్ఎస్ కాదు.. వీఆర్ఎస్.. పొరపాటున అలా పేరు పెట్టారు : పవన్ ఖేరా
Congress Leader Pawan Khera Comments On BRS. జనవరి 30న భారత్ జోడో యాత్ర ముగుస్తోందని.. ఆ తరువాత కూడా భారత్ జోడో యాత్ర
By Medi Samrat Published on 25 Jan 2023 6:08 PM ISTజనవరి 30న భారత్ జోడో యాత్ర ముగుస్తోందని.. ఆ తరువాత కూడా భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉంటామని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి 6 లక్షల గ్రామాల్లో యాత్ర చేపట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేస్తామని.. అన్ని వర్గాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. పాదయాత్రలో తెలిసిన ప్రజా సమస్యలన్నింటికి రాహుల్ సందేశం అద్దం పడుతోందని పేర్కొన్నారు. మోదీ సర్కారులో నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు.
లద్దాఖ్ లో మన సైనిక చెక్ పోస్టులను చైనా ఆక్రమించింది. అలాంటిది ఏమి లేదంటూ మోదీ బుకాయించారని విమర్శించారు. మోదీ పుణ్యమా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. చిన్న మధ్య తరహా వ్యాపారులు రోడ్డున పడ్డారు. 100 మంది బడా పారిశ్రామిక వేత్తల చేతిలోనే 13 లక్షల కోట్ల సంపద పోగయిందని ఆరోపించారు. ప్రజల మధ్య వైషమ్యాలు, చిచ్చులు పెట్టి బీజేపీ, మోదీ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ ద్వారా ప్రతి ఇంటికి మోదీ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు తీసుకెళ్తామని తెలిపారు.
బీజేపీకి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం తెలిస్తే.. సర్కారును ఎలా నడపాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని పేర్కొన్నారు. మీడియా అంతా మోదీ చేతిలో బందీగా మారింది. పారదర్శక మీడియా ప్రజల పక్షాన నిలవాలని కోరారు. మోదీ సర్కార్ ను ప్రశ్నిస్తే ద్రోహిగా ముద్ర వేస్తున్నారని అన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ మీద మోదీ నోరు విప్పకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్‌పై కూడా విమర్శలు గుప్పించారు పవన్ ఖేరా. అది బీఆర్ఎస్ కాదు.. పొరపాటున అలా పేరు పెట్టారు. అసలు వీఆర్ఎస్ అది. రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మీడియా స్వేచ్చకు ఎలాంటి భంగం కలగలేదని అన్నారు. రాజీవ్ గాంధీ నుంచి మేమంతా ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నామన్నారు. మోదీ 8 ఏళ్ల పాలనలో కాగ్ రిపోర్టులపైన ఎప్పుడైనా చర్చ జరిగిందా.. అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి కొలీజియం సిస్టంపై కూడా మోదీ రాజకీయం చొప్పిస్తున్నారని ఆరోపించారు.