హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులకు టీపీసీసీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో మంత్రికి ఆరుగురు కార్పొరేషన్ ఛైర్మన్‌లను అటాచ్ చేస్తూ టీపీసీసీ పేర్కొంది. మరో వైపు 18 మంది కార్పొరేషన్ ఛైర్మన్లకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించింది.
మరో వైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కార్పొరేషన్ ఛైర్మన్లు సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో గెలుపు అవకాశాలపై కార్పొరేషన్ ఛైర్మన్లకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మంత్రులు పొన్నం, వివేక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఏదేమైనా జరగబోయే ఉప ఎన్నిక ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది.