హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాబు మరణించిన సంఘటనపై కాంగ్రెస్ ప్రతినిధులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు షేమ్ కేటీఆర్, షేమ్ జీహెచ్ఎంసీ ఫ్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-కార్ రేస్ మీద ఉన్న దృష్టి.. మున్సిపల్ శాఖ లో ఏం జరుగుతుందో.. తెలుసుకునే తీరిక కేటీఆర్ కు లేదా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు.. మేయర్ ఏం చేస్తుందో ఏవరికీ తెలియదని దుయ్యబట్టారు. గద్వాల విజయలక్ష్మి మేయర్ పదవికి అనర్హురాలని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. కేటీఆర్ కు ఎలక్షన్ మీద ఉన్న దృష్టి.. ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు. అలాగే.. బాలుడు మృతి చెందిన అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు కోట నీలిమ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల, అధికార ప్రతినిధి కాల్వ సుజాత, ఫిరోజ్ ఖాన్, ధర్పల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.