రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. చేవెళ్ల నియోజక వర్గం షాబాద్‌లో ఎమ్మెల్యే కాలే యాదయ్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేయడానికి ఎమ్మెల్యే యాదయ్య షాబాద్ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం మొదలైంది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాల వారితో మాట్లాడి సమస్య సద్దుమణిగేటట్లు చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకున్నది చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ అనుచరులుగా పోలీసులు గుర్తించారు. ఇంచార్జ్‌కు సమాచారం లేకుండా ఎమ్మెల్యే ఇక్కడికి ఎలా వస్తాడని భీమ్ భరత్ అనుచరులు ప్రశ్నిస్తుననారు. ఎమ్మెల్యే యాదయ్య గత పది సంవత్సరాల నుండి షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకుని.. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఎమ్మెల్యే అనుచరులకే నామినేట్ పోస్టులను ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.