కొంచెం కూడా మానవత్వం ఉండదు.. ఫ్రీగా దొరుకుతుంటే చాలు దోచేయడానికి ఎగబడుతూ ఉంటారు. తమది కాని సొత్తును తీసుకుని వెళ్ళడానికి మనసు ఎలా వస్తుందో ఏమో!! సూర్యాపేట మండలం రాయన్నగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరి బొండాలతో వెళ్తున్న లారీ బోల్తా పడగా, అందులోని బోండాల కోసం స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎగబడ్డారు.
నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బోండాల లోడుతో ఓ లారీ బయలుదేరింది. సూర్యాపేట సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంతో లారీలోని కొబ్బరి బొండాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సాయం చేయాల్సింది పోయి, రోడ్డుపై పడిన కొబ్బరి బొండాలను ఏరుకెళ్లేందుకు పోటీపడ్డారు. చేతికి అందినవాటిని అందినట్టుగా సంచుల్లో, బస్తాల్లో నింపుకొని ఇళ్లకు పంపించారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం కలిగించారు ప్రజలు.