జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By - Knakam Karthik |
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని, 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు. 'గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్లనూ పునర్‌వ్యవస్థీకరిస్తాం' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విస్తరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని మండలాలు రెండు వేర్వేరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లడం, మరికొన్ని నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. విజ్ఞప్తుల మేరకు అవసరమైతే కొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్యను కుదించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉండగా.. తాజాగా మరో 12 డివిజన్లు, 25 మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.