రేపు ఎమ్మెల్యేలతో సీఏం రేవంత్ రెడ్డి సమావేశం అవనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి MCRHRDలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ పార్టీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదిలావుంటే.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈరోజు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా బీసీ గణనపై ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల నుంచి, బీసీ సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయాలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.