27న జ‌రిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని.. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  24 July 2024 7:45 PM IST
27న జ‌రిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని.. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారని.. ఆ తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చామని తెలిపారు.

ఎవరి దయాదాక్షిణ్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదన్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిసా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిసామని.. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామ‌న్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిసాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదన్నారు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి అని అన్నారు.

కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు.. ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు అని వివ‌రించారు. తెలంగాణ నుంచి 3 లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమేన‌న్నారు.

మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని అన్నారు. అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత? అని ప్ర‌శ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లు కాగా.. కేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమేన‌న్నారు. యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే.. కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు అని వివ‌రించారు. ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష అని విమ‌ర్శించారు.

దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పామ‌న్నారు. మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరామ‌ని.. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం అన్నారు. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడంలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిమిషం వరకూ ప్రయత్నం చేశామ‌న్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందు.. నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామ‌ని ప్రకటించారు.

Next Story