తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By - Knakam Karthik |
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు విషయాలు తెలిపారు. ప్రాధాన్యత వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉంది. జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందే.. నియోజకవర్గం అభివృద్ధి జరగాల్సిందే. బీఆర్ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్ లేదు. బీఆర్ఎస్.. పంతులు లేని బడిలా నడుస్తోంది. నాది లీడర్ మైండ్ సెట్ కాదు. క్యాడర్ మైండ్ సెట్. అందుకే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా. గడప గడపకు కూడా ప్రచారం చేస్తా అన్నా.. సెక్యూరిటీ ఒప్పుకోలేదు. అందుకే ఆగిపోయా. జూబ్లీ పోరులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు" అని అన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎట్టిపరిస్థితుల్లో పోల్చద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు పాలనలకు నక్కకు నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఉందన్నారు. తమ పాలనలో ప్రజలకు మేలు జరిగితే.. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను ముంచిందని విమర్శించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పూర్తిగా దివాలా తీయడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక్క పథకాన్ని కూడా తాము ఆపలేదని, అన్ని పథకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నాశిరకం బతుకమ్మ చీరలు ఇచ్చి దోపిడీ చేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు రెండిటిని ఇవ్వాలని పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని కొలబద్దగా తీసుకుని పరిశీలించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వేయాలన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, 2014-2023 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలు పరిశీలించాలని, ఆ విషయాలను తమను ప్రశ్నించి ఒక నిర్ణయానికి రావాలని అన్నారు. అసలు అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ పాలనలో అని అన్నారు. "ఉచిత కరెంట్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రూ. 1300 కోట్ల బకాయిలను రద్దు చేసిన ఘనతా ఆయనకే సొంతం. వ్యవసాయాన్ని పండగగా మార్చిన నేత వైఎస్సార్. రైతులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం ఎన్నో ప్రాజెక్ట్లను నిర్మించిన పార్టీ కాంగ్రెస్. ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ పక్కాగా అమలు చేశాం" అని రేవంత్ చెప్పుకొచ్చారు.