తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన రద్దు అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 5న జార్ఖండ్ కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉండనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరంతా శామీర్ పేట లోని లియోని రిసార్ట్ లో ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు వారి రాష్ట్రానికి ప్రయాణం కాబోతున్నారు. ఆ మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లనున్నారు.
ఫిబ్రవరి 5న తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు పర్యటన షెడ్యూలు కూడా వచ్చింది. కానీ జార్ఖండ్ లోని రాజకీయ పరిణామాలతో కొడంగల్ టూర్ క్యాన్సిల్ చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ కు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అధికారుల బృందం నియోజకవర్గంలోని కొడంగల్, బొంరా్‌సపేట్, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల్లో పర్యటించారు. ఇప్పుడు సీఎం కొడంగల్ కంటే జార్ఖండ్ సంక్షోభం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఆయన పర్యటన రద్దు అయింది.