ఆ స‌మ‌యంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat
Published on : 17 July 2025 6:58 PM IST

ఆ స‌మ‌యంలో కేటీఆర్ లోకేష్‌ను ఎందుకు కలిశారు.? : సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వంపై గొడవ జరుగుతుందని అన్నారు. కేటీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు.. ఆమె ఇంట్లోనే విలువ లేదని.. చెల్లి కవితనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోవటం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో.. స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు.. కొందరు సూసైడల్ టెండెన్స్‌తో బాధపడుతున్నారంటూ సైటైర్లు సంధించారు.

నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం, వైరుద్యం లేదన్న సీఎం.. కేసీఆర్ సైతం నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేన‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేయాల్సినంత నష్టాన్ని చేశారని.. 700 టీసీఎంల నీటిని రాయలసీమకు అక్రమంగా పంపించాడని ఆరోపించారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని తెలంగాణ రైతులు ఎప్పటికీ క్షమించరన్నారు.

కేటీఆర్‌కు ఓ గంజాయి బ్యాచ్ ఉందని.. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని.. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. డ్రగ్స్ పరీక్షకు రమ్మంటే పారిపోయింది ఎవరు అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి సోడా పోయటం తప్ప ఏమీ తెలియన్నారు.

కేటీఆర్.. ఏపీ మంత్రి నారా లోకేష్‌ను అర్థరాత్రి సమయంలో మూడు సార్లు ఎందుకు కలిశాడ‌ని.. రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని.. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లలాగ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారికంగా పిలిస్తే కేంద్రంతో చర్చించటానికి.. సమీక్షలకు వెళతానని.. రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం అని వివరించారాయన. బీసీ రిజర్వేషన్లపై తమదైన వ్యూహం ఉందని, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై.. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 'విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారు' అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Next Story