రైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
వరంగల్ వేదికగా రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
By అంజి Published on 20 Nov 2024 6:13 AM ISTరైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
వరంగల్ వేదికగా రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. “అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీపై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం పండించనంత ధాన్యం తెలంగాణలో పండిందని సీఎం అన్నారు. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారని తెలిపారు. ఈ ధాన్యానికి ఎంఎస్పీతో పాటు సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేని తెలిపారు. రాష్ట్రానికి ప్రతి నెలా 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై అప్పు, వడ్డీ కింద మరో 6,500 కోట్లు పోతున్నాయని, ఇక మిగిలిన 5,500 కోట్ల ఆదాయం ఉంటే... ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ రూపాయి రూపాయి కూడబెట్టి రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఏడాది పాలన సందర్భంగా “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ఒకేసారి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ, బీమా చెక్కులను అందజేశారు. మహిళా సంఘాలు నిర్వహించే సౌర విద్యుత్ కొనుగోలుపై డిస్కంలు - సెర్ప్ కు మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్ని సీఎం ముందుగా స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం అశేషంగా హాజరైన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.