మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
By - Knakam Karthik |
మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఐటీసీ కోహినూర్‌లో దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ..ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశం. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ గారిని కోరుతున్నా. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి ..అని సీఎం రేవంత్ కోరారు.
రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నాం. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దేశ ఎకానమీలో 10 శాతం ఎకానమీని తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు మేం భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదు.. మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.