బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By - Knakam Karthik |
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి , మహాత్మా గాంధీ, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్‌లు రాజ్యాంగ రూపకల్పన సమయంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలకు ఓటు హక్కు కల్పించేందుకు గట్టిగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు భిన్నంగా, పేదలు ఓటు హక్కు వినియోగించుకుని తమ ప్రభుత్వాన్ని ఏర్పరుచుకునే అవకాశాన్ని గాంధీ, అంబేడ్కర్ కల్పించారని రేవంత్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.
గత ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి దేశ ప్రజలు 240 సీట్లకే పరిమితం చేశారని, దీంతో రాజ్యాంగం, రిజర్వేషన్లు సురక్షితంగా నిలిచాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగ మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నాలు జరిగేవని రాహుల్ గాంధీ ఇప్పటికే హెచ్చరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఓటర్ లిస్టుల సవరణలు, నగరాల పేర్లు, ఓటు దొంగతనం పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ఒకసారి ఓటు హక్కు పోతే, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులు, చివరకు భూములు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రేవంత్ హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో గాంధీ, అంబేడ్కర్‌ల మార్గాన్ని అనుసరిస్తూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల తరఫున బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ సమస్య కాదని, దేశ ప్రజల సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటంలో రాహుల్ గాంధీని బలపర్చాలని, ఆయన సైనికుల్లా నిలబడి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.