హైదరాబాద్: తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని, ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు.
పర్యావరణ పునరుజ్జీవం కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేక్ సిటీ.. పబ్లిక్‌సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదన్నారు. హైడ్రా ఏర్పాటు వెనుక రాజకీయ కోణం, కుట్ర లేదన్నారు. కొంతమంది ల్యాండ్ మాఫియా వాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు.
తాను ఫామ్‌హౌస్ సీఎంని కాదని.. పని చేసే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు. గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందన్నారు. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.