పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్‌ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్​ ఫ్యూచర్​ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్​ రెడ్డి శ్రీకారం చుట్టారు

By -  Knakam Karthik
Published on : 28 Sept 2025 3:19 PM IST

Telangana, Rangareddy District, CM Revanthreddy, Congress Government

పదేళ్లు టైమివ్వండి, న్యూయార్క్‌ను తలపించేలా ఫ్యూచర్ సిటీ కడతా: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్​ ఫ్యూచర్​ సిటీ కార్యాచరణకు సీఎం రేవంత్​ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్​ఖాన్​పేటలో ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ (ఎఫ్​సీడీఏ) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. అనంతరం ఫ్యూచర్​ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, పరిశ్రమలు, లే అవుట్లలకు ఎఫ్​సీడీఏ అధికారులు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, అడ్లూరి లక్ష్మణ్​ ఉన్నారు. రావిర్యాల-ఆమన్​గల్​ గ్రీన్​ఫీల్డ్​ రేడియల్​ రోడ్​-1కు సీఎం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్​ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఇక్కడ భూములు ఉన్నందువల్లే ఫ్యూచర్​ సిటీ కడుతున్నానని అంటున్నారని ధ్వజమెత్తారు. నా కోసం కాదు భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్​ సిటీ నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. చంద్రబాబు, వైఎస్​ఆర్​ ముందు తరాల కోసం ఆలోచించారని, అందువల్లే హైటెక్​ సిటీ, శంషాబాద్​ ఎయిర్​పోర్టు, ఓఆర్​ఆర్​ వచ్చాయని గుర్తు చేశారు. మన భవిష్యత్తుకు ప్రణాళికలు మనమే రచించుకోవాలని సూచించారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలన్నారు.

'ఎన్నాళ్లు ఇలా న్యూయార్క్​, సింగపూర్​, దుబాయి గురించి చెప్పుకుంటాం. చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా నిర్మాణాలు ఉన్నాయని చెబుతుంటారు. ఎన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటాం. మనం కూడా అలా తయారు కావాలి కదా? నాకు పదేళ్లు సమయం ఇవ్వండి న్యూయార్క్‌​ను మరిపించే నగరం కడతా. 70 ఏళ్ల నుంచి విదేశాల గురించే చెప్పుకుంటున్నాం. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా?. అభివృద్ధి పనుల వల్ల కొందరికి ఇబ్బందులు కలగవచ్చు. వాటి వల్ల నష్టపోయేవారిని అన్ని విధాలా ఆదుకుంటాం.' అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు.

Next Story