ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఏపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 23 July 2024 7:28 PM ISTకేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఏపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరిపి తెలంగాణపై వివక్ష చూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీకి ఎందుకు ఇచ్చారని తాము అడగడం లేదని.. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషించాలని తాము పదేపదే అడిగినా తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఎన్డీయే సర్కార్‌ది కుర్చీ బచావో బడ్జెట్ అని.. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక కేటాయింపులు చేశారన్నారు. ఇలాంటి చర్యలు మోదీకి గౌరవాన్ని తెచ్చిపెట్టదన్నారు.
తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో కూర్చున్నారని.. తెలంగాణ ప్రజలకు బీజేపీ కృతజ్ఞత చూపాల్సిన సమయం ఇదే అన్నారు. తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. కిషన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కనీసం సవరించే బడ్జెట్‌లో అయినా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని కేసీఆర్ నిలదీయాలన్నారు. మూడుసార్లు ప్రధాని మోదీని నేరుగా కలిసి వివక్ష లేకుండా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరానని.. కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదన్నారు.