ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  17 Oct 2024 12:55 PM GMT
ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి.. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం అని తెలిపారు.

ప్రపంచంతో పోటీపడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం.. ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చారని.. కాంగ్రెస్ విజన్ వల్లే దేశానికి ప్రపంచంతో పోటీ పడే శక్తి లభించిందన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. అధికారం కోల్పోయిన నిస్పృహతో కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.. బందిపోటు దొంగల్లా పదేళ్లు తెలంగాణను దోచుకున్నవారు మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

సుందరీకరణ అంటూ కాస్మటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారు..వాళ్ల మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకున్నారన్నారు. ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసం,మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే మా ప్రయత్నం అన్ని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలనేదే మా ఆలోచన అన్నారు. మల్లన్న సాగర్ ,రంగనాయక్ సాగర్ , కొండపోచమ్మ కు నేను ఎక్కడికైనా వస్తా.. ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా.. మీరూ రండి రచ్చబండ నిర్వహిద్దాం.. కేసీఆర్ నీ నియోజకవర్గానికి నేను వస్తా.. రచ్చబండలో కూర్చుని చర్చిద్దాం అన్ని సవాలు చేశారు.

ఇది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ పునరుజ్జీవనం..

ఇది కొందరు దుబాయ్ వెళ్లి అందం కోసం జుట్లు నాటించుకోవడం లాంటి కార్యక్రమం కాదు.. నగరం మధ్య నదీ ప్రవాహం ఉన్న నగరం దేశంలో ఎక్కడా లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిని తరలించాలనేదే మా ఆలోచన అని తెలిపారు. 1600 పైచిలుకు మూసీ ఇండ్లు నదీ గర్భంలో ఉన్నాయి. దసరా నేపథ్యంలో వారికి ఇండ్లు ఇచ్చి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించాం అని తెలిపారు.

బఫర్ జోన్ లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తాం అన్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టం లేదా? చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయదలచుకున్నారా.? మేం ఉండేది ఐదేళ్లా, పదేళ్లా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమే.. మరి లక్షా 50 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నారు. మూసీ పునరుజ్జీవనం అనే గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి.. అసూయ, ద్వేషంతో కొందరు సృష్టించే అపోహలను నమ్మకండని సూచించారు .

హరీష్, కేటీఆర్, ఈటెల ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి.. ఇప్పుడే ఆ ముగ్గురికీ ఇండ్లు కేటాయించాలని అధికారులకు ఆదేశిస్తున్నా.. వాళ్లకు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయండని అధికారులతో అన్నారు. మూసీ పరివాహకం అలాగే ఉండాలనుకుంటే.. మీరు అక్కడ ఉండి రోల్ మోడల్ గా నిలవండి అన్ని పిలుపునిచ్చారు. ఒక తెలంగాణ కవి తన నలుగురు కూతుర్లకు గంగ, యమునా, సరస్వతీ, కృష్ణవేణి అని పేర్లు పెట్టుకున్నాడు.. మన మూసీ నది పేరు పెట్టుకోకపోవడానికి గత పాలకులు కారణం కాదా.? ఈ ద్రోహాన్ని ఇలాగే కొనసాగిద్దామా..? దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరం అన్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్, కమ్యూనిస్టు పార్టీల అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో నాకు పంపండి.. ప్రభుత్వం రాతపూర్వక వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.

Next Story