హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్ వాళ్లు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ముందుగా శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చేర్చారు.