మీడియాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మద్దుల పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - Medi Samrat |
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మద్దుల పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బలపరిచే మీడియా రాతలు మానుకోండి అని సూచించారు సీఎం రేవంత్. మీడియా యాజమాన్యాల కొట్లాట మీ వ్యక్తిగతం, విచక్షణ మరిచి వ్యవహరించ వద్దన్నారు. సహచర మంత్రులపై వార్తలు రాసే క్రమంలో తన వివరణ తీసుకోవాలన్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయని, తమ ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు తావుండదన్నారు.
గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలి అంటే ఉన్న వారు చనిపోతేనే వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న పేదవాడికి రేషన్ కార్డులు అందించాలన్నారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి.. ఆయనను ఈ రోజున స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేద వాడి కోసం 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశ పెట్టారు. అదే పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 రూపాయలకే సన్న బియ్యం ప్రవేశపెట్టామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం , రైతుల సంక్షేమం కోసం తొలి సంతకం చేసిన మహానుభావుడు. 2004 - 2014 వరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదవాడి ఆత్మగౌరవం నిలబెట్టింది కాంగ్రెస్. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకాన్ని కొనసాగిస్తున్నాం. పార్టీ ప్రాంతం వేరైనా ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.