అసెంబ్లీలో కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏమ‌న్నారంటే..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం లేదు.

By Medi Samrat  Published on  9 Feb 2024 12:34 PM GMT
అసెంబ్లీలో కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏమ‌న్నారంటే..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం సభకు గౌరవం కాదని అన్నారు. ఆ కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదని, ఆయన సభకు వచ్చి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు చేస్తే బాగుండేదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మీలో మార్పు రావాలని ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారని, ఈ హోదా ద్వారా ప్రజల తరఫున కొట్లాడేందుకు మరో అవకాశం ఇచ్చారన్నారు. ప్రతిపక్ష నేత సభకు హాజరై, మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైనా ఉంటే సూచనలు చేసేలా ఉండాలన్నారు. కానీ ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం బాధాకరమన్నారు.

80వేల పుస్తకాలను చదివానని కేసీఆర్ పదేపదే చెబుతారని... కానీ అందుకు అనుగుణంగా నడుచుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నానని.. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా సభకు రావాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకొని, ఇతర వాటిలో సూచనలు చేస్తారని భావించానని, కానీ వారి నాయకుడి మెప్పు కోసం ఆయన తమపై విమర్శలు చేసినట్లు కనిపించిందన్నారు రేవంత్ రెడ్డి.

Next Story