అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది : సీఎం రేవంత్

ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  28 Aug 2024 9:05 AM GMT
అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది : సీఎం రేవంత్

ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయన్నారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని.. ఆ నీళ్లు హైదరాబాద్‌ ప్రజలు తాగాలా.? అందుకే కూల్చివేతలు అని వివ‌ర‌ణ ఇచ్చారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్ లీజ్‌కు తీసుకున్నట్టు చెబుతున్నారు.. లీజు విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదన్నారు. కేటీఆర్‌ను డిస్‌క్వాలిఫై చేయాలన్నారు.

నిబంధనలు అతిక్రమించి ఫామ్‌హౌస్‌లు కడితే ఎలా అని ప్ర‌శ్నించారు. హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం అంటూ లేదు. మొదట కూల్చింది కాంగ్రెస్ నేత పళ్లంరాజు నిర్మాణాన్నే అని గుర్తు చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్‌కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవన్నారు. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తుందన్నారు.

హైడ్రాకు పోలీస్‌ స్టేషన్ స్టేటస్ ఇస్తామ‌న్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అక్రమ నిర్మాణాలు ఉంటే మాకు లిస్ట్ ఇవ్వండి.. నిలబడి కూల్చేస్తామ‌న్నారు. 111 జీవోను గత ప్రభుత్వం ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టింది.. కానీ 111 జీవో అలాగే ఉంటుందన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారు.. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందన్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా రాలేదన్నారు.

అందరికీ రుణమాఫీ జరుగుతుంది.. కలెక్టర్ల దగ్గర గ్రీవెన్స్ పెట్టామ‌ని పేర్కొన్నారు. హరీష్‌, కేటీఆర్‌ రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు.. రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వండి.. పరిశీలిస్తామ‌న్నారు. ఇప్పటివరకు 17,933 కోట్లు రుణమాఫీకి జమ చేశామ‌న్నారు. 2 లక్షలకు పైగా ఉన్నవారు.. పైన ఉన్న అమౌంట్‌ కట్టేస్తే రూ.2లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు.

ఒవైసీ కాలేజీ విషయంలో విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చామ‌న్నారు. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నామ‌న్నారు.

Next Story