హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలి ..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ధాన్యంకొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతీరోజు కలెక్టర్ కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరు ఫీల్డ్ లో ఉండాల్సిందే..అని సీఎం స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానీటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి..అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.