రైతులతో ఆడుకోవ‌ద్దు : కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

CM KCR Fire On Center. రాష్ట్ర రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై

By Medi Samrat  Published on  11 April 2022 8:19 AM GMT
రైతులతో ఆడుకోవ‌ద్దు : కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

రాష్ట్ర రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన టీఆర్‌ఎస్‌ దీక్షలో పాల్గొని ప్రసంగించిన రాకేష్ తికాయ‌త్‌, టీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరితోనైనా ఆడుకోవ‌చ్చు కానీ.. దేశంలో రైతులతో ఆడుకోవ‌ద్ద‌ని హెచ్చరించారు.

ఏ ప్రభుత్వాలు రైతులతో ఆడుకున్నాయో వాటిని అధికారం నుంచి దించారని చరిత్ర చెబుతోందన్నారు. రైతులకు పచ్చి బియ్యం తినడం అలవాటు చేసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసి తెలంగాణ అన్ని వనరులను కోల్పోయిందని, అభివృద్ధి అంతా ఆగిపోయిందన్నారు. రైతులు చాలా నష్టపోయారు. పంటలకు నీరు లేకపోవడంతో పాటు అప్పుల బాధతో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు, ప్రజలు ప్రాణత్యాగం చేశారని కేసీఆర్ అన్నారు. ఎన్నో త్యాగాల అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను పీయూష్‌ గోల్‌మాల్‌గా అభివర్ణించిన కేసీఆర్‌.. అనేక సందర్భాల్లో ఆయ‌న‌ రైతులను అవమానించారని అన్నారు. దాదాపు 13 నెలల నిరంతర నిరసనల అనంతరం రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌కుమార్‌లు వరి పండించేలా ప్రజలను ఒత్తిడి చేశారని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ దీక్ష చేస్తోందని ఆరోపించారు. ఒక్కసారి తెలంగాణ సమస్యపై పోరాడాలని నిర్ణయించుకుంటే సమస్య పరిష్కారం కానంత వరకు విశ్రమించబోమన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం అనుసరిస్తున్నారన్నారు. ప్రధాని మోదీకి ఓట్లు, మద్దతు కావాలి కానీ.. రైతుల నుంచి మాత్రం వరిధాన్యాన్ని కొనుగోలు చేయర‌ని అన్నారు. సిబిఐ, ఈడీని ఉపయోగించుకుని విపక్షాలపై కేంద్రప్రభుత్వం కేసులు వేస్తోందన్నారు. సీబీఐ, ఈడీలు ఏ ఒక్క బీజేపీ నాయకుడిని ప్రశ్నించలేదని అన్నారు.


Next Story
Share it