తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ ఉండగా..
By Medi Samrat Published on 13 Nov 2023 12:15 PM GMTతెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చేది ఆలస్యం అయిందంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. 2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని చెప్పారు. ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును, గుణాన్ని చూడాలన్నారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని, ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు. కులం, మతం భేదం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడానికి ఎన్ని ఇబ్బందులుపడ్డామో మనందరికీ తెలిసిందేనన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది, ఉద్యమాలను అణిచివేసింది, ఎప్పుడో రావాల్సిన తెలంగాణను ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు సీఎం కేసీఆర్. గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వవచ్చునని ఏ కాంగ్రెస్ నేతా గతంలో ఆలోచన చేయలేదన్నారు. కానీ మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, ఇది పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.