తెలంగాణలో ఉద్యమాలకు పునాది రాయి అయిన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) ఓయూ వెళ్లనున్నారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వచ్చి వర్సిటీలో ప్రసంగించే వ్యక్తిగా రేవంత్ నిలవనున్నారు.
కాగా ఉస్మానియా వర్సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టళ్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్టళ్లలో 7223 మంది విద్యార్థులకు వసతి ఉండగా.. సీఎం చేతులు మీదుగా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వసతిని సమకూర్చనున్నాయి. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘తెలంగాణ విద్యా రంగంలో మార్పులు ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. ఇదే సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు 'సీఎం రీసెర్చ్ ఫెలోషిప్' ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.