వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తక్షణ సాయంగా రూ.3,448 కోట్లను వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తక్షణ సహాయం అందించడానికి మేము కృషి చేస్తున్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. విపత్తు సహాయ నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) కింద రూ. 3,448 కోట్ల తక్షణ సాయం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని ఆయన వివరించారు.
తక్షణ సహాయం అందించిన తరువాత, తదుపరి పంటకు రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన తెలిపారు. పంటనష్టాన్ని అంచనా వేసి కేంద్రం తగిన పరిహారం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సంక్షోభ సమయంలో రైతుల నుండి రుణాలు వసూలు చేయవద్దని మేము బ్యాంకులను కోరుతామని కూడా చెప్పారు.
ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఏరియల్ సర్వే చేశారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కేంద్రం తరఫున బాధితులకు అండగా ఉంటామన్నారు.