అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చారు.? సీఎంపై బండి సంజయ్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.
By - Medi Samrat |
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా? ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే... మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లు? అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్ రెడ్డే చెప్పారు కదా? ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం అన్నారు.
ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోతే కాలేజీలు ఎట్లా నడవాలి? అధ్యాపకులకు జీతాలివ్వకపోతే విద్యార్థులకు చదవు చెప్పేదెవరు? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలపై సీఎంకు ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించి.. చట్టం గురించి మాట్లాడితే మంచిదన్నారు. అసలు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా.? ఎత్తి వేస్తారా.? ప్రజలకు స్పష్టం చేయండన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేదాకా విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీ యాజమాన్యాలు చేసే ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు కొనసాగుతుందన్నారు.