హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ సమాచారం అందించింది. కోర్టు తీర్పులను పరిగణనలోకి ముందుకు వెళ్లాలని, ఫారెస్ట్ యాక్ట్‌కు లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్యురేట్ రిపోర్టు, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పేర్కొంది.
కాగా యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు అంటుండగా, ఆ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.