తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమపై ఈడీ, సీబీఐ,ఐటీ సంస్థలను వేట కుక్కల్లా ప్రయోగించే అవకాశం ఉందని.. అన్నింటికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. బీఆర్ఎస్ నుఏర్పాటు చేసినందున తమపై కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆపార్టీని వీడనున్నారని చెప్పారు. ప్రధానప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని.. కేరళలో రాహుల్ భారత్ జోడోయాత్ర చేస్తుంటే గోవాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారన్నారు.
శుక్రవారం నాడు తెలంగాణమంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని.. అందుకే తాము దేశ రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ పార్టీ టార్గెట్ గా పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికలలోపుగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే బీజేపీలో చేరినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వేలు, సామాజిక సమీకరణలు, స్థానిక ప్రజల మద్దతు తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.