బీజేపీ ఎంపీ మద్దతుతో సీఎం HCU భూ కుంభకోణానికి తెరతీశారు: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik
ఒక బీజేపీ ఎంపీ మద్దతుతో HCU భూ కుంభకోణానికి రేవంత్ తెరతీశారు: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక రూ.10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ సీఎం రేవంత్ రెడ్డి. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం కూడా ప్రభుత్వానికి లేదు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఒక బీజేపీ ఎంపీ మద్దతుతో రేవంత్‌రెడ్డి హెచ్‌సీయూ భూముల కుంభకోణానికి తెరతీశారు. ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీ రేవంత్ రెడ్డికి బ్రోకరిజం చేసింది. అందుకు గాను సదరు కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారు...అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పాలన అంటేనే.. మోసం, విధ్వంసం, దృష్టి మళ్లింపు. భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. అతిపెద్ద కుంభకోణం. తమది కాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడుతుంది? రూ.5,200 కోట్లు విలువైన భూమిని రూ.30 వేల కోట్లుగా చూపించారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌ఎఫ్ఐఓ, సెబీ, సెంట్రల్ విజిలెన్స్, సీబీఐకి లేఖ రాస్తాం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థికమంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం జరిగింది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీవీసీ, సీబీఐ విచారణ జరపాలి. కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లే. హెచ్‌సీయూ భూముల వెనుక క్విడ్ ప్రోకో ఉంది. సదరు బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ కొన్ని లాభాలు చేయబోతున్నారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా.. రూ.10 వేల కోట్లు తెచ్చారు. లిటిగేషన్ ల్యాండ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఎలా లోన్ ఇచ్చింది? ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా ప్రభుత్వానికి రుణం ఇచ్చింది..అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
#HCU భారీ కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన ఒక బీజేపీ ఎంపీఒక బీజేపీ ఎంపీ, ఒక బ్రోకరేజ్ కంపెనీ సహకారంతో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డ రేవంత్.ఆ భూముల మీద టీజీఐఐసీకి ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ లేకున్నా ఆ భూములను తాకట్టు పెట్టింది.-… pic.twitter.com/V7BmHvGUcd
— BRS Party (@BRSparty) April 11, 2025