మీడియా ముందు రంకెలు కాదు, అంకెలు ఎందుకు మాయమయ్యాయి? రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఎద్దేవా

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 19 March 2025 2:07 PM IST

Telangana, Ktr, Brs, Assembly Budget Sessions, Congress Government

మీడియా ముందు రంకెలు కాదు, అంకెలు ఎందుకు మాయమయ్యాయి? రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ ఎద్దేవా

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేని పరిస్థితి. రూ.4000 పెన్షన్ ఎగ్గొట్టారు. 420 హామీలపై బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇస్తామన్న పీఆర్సీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంబేద్కర్ అభయ హస్తంపై ప్రస్తావనే లేదు. నిరుద్యోగుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. బలహీనవర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది.. అని కేటీఆర్ విమర్శించారు.

సీఎం రేవంత్ మీడియా ముందు రంకెలు వేయడం కాదు, అంకెలు ఎందుకు ఆగమయ్యాయో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం అధ్వానంగా మారింది. రాష్ట్ర ఆర్థిక చోదశక్తి హైదరాబాద్ మహానగరం. ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలుంటాయో వీళ్లకు తెలియదు. మొదటి ప్రాధాన్యత రైతులు కాదు, ఢిల్లీకి మూటలు పంపడమని అర్థమైంది..అని కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ రూ.26 వేల కోట్లు చేశామని చెప్పి, బడ్జెట్‌లో మాత్రం రూ.20 వేల కోట్లు చేశామని చెబుతున్నారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం సవాల్ చేశాం. నిన్నటిదాకా 20 శాతం కమిషన్ ఈ ప్రభుత్వానిది.. ఈ రోజు బడ్జెట్‌లో అది 40 శాతం అని తేలింది. నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు నాలుగు కోట్ల ప్రజలను ముంచిన బడ్జెట్ ఇది. ఆకాశం నుంచి పాతాలం వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పోతుంది. ఈ బడ్జెట్‌ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని.. కేటీఆర్ అన్నారు.

Next Story