తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే గుర్తుకు వస్తున్నారు కావొచ్చు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 15 నెలల స్వల్ప కాలంలోనే అధికార పార్టీని వదలి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే.. ఆ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతం ఇది. అని కేటీఆర్ మాట్లాడారు. ప్రతి రోజు కేసీఆర్‌ను విమర్శించే రేవంత్ రెడ్డి.. బీజేపీని ఒక్క మాట కూడా అనడంలేదని విమర్శించారు. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మేం చేసిన అప్పు సంవత్సరానికి రూ.41 వేల కోట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలోనే రూ.1.50,000 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోతే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓడినా పర్వాలేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరో మాదిరి రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడుతామంటూ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే తిరుగుబాటు మొదలైంది అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది...అని కేటీఆర్ జోస్యం చెప్పారు.