కాంగ్రెస్ మరో ఘరానా దోపిడీకి తెరలేపింది, ప్రజలకు వెన్నుపోటు పొడవడమే: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ స్కీమ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 3 April 2025 8:37 AM IST

Telangana, Congress Government, Ktr, Cm Revanthreddy, LRS Concession Offer  Extended

కాంగ్రెస్ మరో ఘరానా దోపిడీకి తెరలేపింది, ప్రజలకు వెన్నుపోటు పొడవడమే: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ స్కీమ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఢిల్లీ పార్టీల మేనిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి అందులో చెప్పేవన్నీ మాయమాటలేనని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత ఎల్‌ఆర్ఎస్ అని మభ్యపెట్టి, గద్దెనెక్కగానే నాలుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ.1400 కోట్లను ముక్కుపిండి వసూలు చేశారు. మరో 15000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఖజానా నింపుకునేందుకు గడువు పెంపు పేరిట మరో ఘరానా దోపిడీకి తెరలేపారు. అని కేటీఆర్ రాసుకొచ్చారు.

నాడు ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ అని హామీ ఇచ్చి జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో రివర్స్ గేర్ లో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే..అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా తెలంగాణలోని లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాయితీ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఎల్‌ఆర్ఎస్ ఫీజు 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ క్రమంలోనే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Next Story