ఓవర్ యాక్షన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టం: కేటీఆర్
లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik
ఓవర్ యాక్షన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టం: కేటీఆర్
లగచర్ల రైతులపై దాడి చేశారనే జాతీయ మానవ హక్కుల కమీషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కు చెంపచెల్లుమనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో 40 మంది రైతులను జైల్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టింది. హీర్యానాయక్ అనే రైతుకు గుండె నొప్పి వస్తే సంకెళ్లతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లగచర్ల మానవ మృగాల్లా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు వ్యవహరించారు. లగచర్ల గిరిజన ఆడబిడ్డలను జాతీయ మానవ హక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్ దగ్గరకు తీసుకువెళ్లాం. లగచర్ల రైతులను చిత్రహింసలు పెట్టారని జాతీయ మానవ హక్కుల కమీషన్ కమిటీ చెప్పింది..అని కేటీఆర్ పేర్కొన్నారు.
లగచర్లలో భూ సేకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. కాంగ్రెస్ నేతలు నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించాలి. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం. కొడంగల్ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోంమంత్రిగా, సీఎంగా రేవంత్ సిగ్గుపడాలి. లగచర్ల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. ఎవరైనా అధికారులు లగచర్లలో ఓవర్ యాక్షన్ చేస్తే మా ప్రభుత్వం వచ్చాక వదలిపెట్టం. అధికారులు రిటైర్డ్ అయినా వాళ్లను పట్టుకుని వచ్చి శిక్షిస్తాం..అని కేటీఆర్ హెచ్చరించారు.
Live: BRS Working President @KTRBRS is addressing the media at Nandinagar, Hyderabad. https://t.co/AaS9VZcJ2J
— BRS Party (@BRSparty) April 22, 2025