జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా : కేటీఆర్
జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని.. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే రెడీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు
By Medi Samrat Published on 7 Nov 2024 5:15 PM ISTజైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని.. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే రెడీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది.. యోగా చేసుకుని బయటకు వస్తాను.. తర్వాత పాదయాత్రకు సిద్దమవుతానన్నారు. టార్గెట్ కేటీఆర్ పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలన్నారు. ఏసీబీ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు.. నాకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయన్నారు. విచారణకు గవర్నర్ అనుమతినిస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తానన్నారు. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయట పడిందన్నారు. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయన్నారు.
ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు అని మండిపడ్డారు. చివరి నిమిషంలో ఫార్ములా-ఈ రేస్‌ను క్యాన్షిల్ చేయడంతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మోటార్ కార్ల రేసింగ్ అనేది ఒక క్రీడ. ఎఫ్-1 రేస్‌ను ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ రేస్ నిర్వహణ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతాయి. దేశానికి ఫార్ములా -1 రావాలనే కల ఈనాటిది కాదు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 28 సెప్టెంబర్ 2003లో అప్పటి ఎఫ్-1 సీఈవోను కలిసి మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలని కోరారు. రేవంత్ రెడ్డి గురువు కన్నకలను మేం నెరవేర్చాం. శిష్యుడు మాత్రం నెరవేర్చలేదు. చంద్రబాబు దాంతో ఆగలేదు. ఎఫ్-1 కండక్ట్ చేయడానికి గోపన్‌పల్లి ప్రాంతంలో 1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. చివరకు 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి డెడికేటెడ్ ట్రాక్ నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ 400 ఎకరాల్లో కూడా రేవంత్ రెడ్డి భూమి ఉంది. భూసేకరణకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భూములు ఇవ్వమని రైతులు కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా నడుస్తోందని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా -1 రేష్ నిర్వహణ కోసం నాటి సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఇటలీ వెళ్లి అడిగారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. యూపీఏ హయాంలో యూపీలో మాయావతి ప్రభుత్వం.. జేపీ(జయప్రకాశ్ గ్రూప్) గ్రూప్ వాళ్లతో ప్రమోట్ చేసి.. ఎఫ్-1ను ఇండియాకు తీసుకొచ్చారు. 2011, 2012, 2013లో నోయిడాలో జేపీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాక్ పై ఎఫ్-1 రేస్ జరిగింది. 1984లో ఏషియన్ గేమ్స్, ఆ తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్ మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగాయి. కామన్ వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి 70,608 కోట్లు ఖర్చు చేయడం జరిగింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే.. 114 రెట్లు ఎక్కువ. ఈ కామన్‌వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు వెళ్లాడని కేటీఆర్ గుర్తు చేశారు.
2013 అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు ఉమ్మడి ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. దీని ఖర్చు 103 కోట్లు. ఒక క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం పరిపాటి. కామన్ వెల్త్ గేమ్స్ యూపీఏ ప్రభుత్వం నిర్వహించింది. నోయిడాలో 2010-11లో ఎఫ్-1 ఖర్చు 1700 కోట్లు. తమిళనాడులో ఫార్ములా -4 రేస్ జరిగింది నాలుగు నెలల క్రితం. ఆ రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టిందని కేటీఆర్ తెలిపారు.
2023 ఫిబ్రవరిలో ఫార్ములా-2 రేస్ నిర్వహించాం. నాలుగేండ్ల పాటు ఒప్పందం కుదిరింది. హోస్ట్ సిటీగా హైదరాబాద్(హెచ్ఎండీఏ), ప్రయివేటు స్పాన్సర్‌గా గ్రీన్ కోకు సంబంధించిన ఏస్ అర్బన్ అనే కంపెనీ, ఎఫ్ఐఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రమోటర్ ఎమన్నారంటే ప్రభుత్వానికి లాభం వచ్చింది కానీ నాకు ప్రచారం రాలేదన్నాడు. వచ్చే ఏడాది స్పాన్సర్ చేయను అని చెప్పి వెనక్కి వెళ్లాడు. ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఎఫ్ఐఏ వాళ్లు ఏం చేశారంటే మాకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్‌లో నిర్వహించట్లేదని. గ్రీన్ కో కంపెనీ పైసలు రాలేదని తప్పుకుంది. ఈ విషయంపై నన్ను జూన్, జులైలో సెక్రటరీ అరవింద్ కుమార్ అడిగారు. గ్రీన్ కో కాకపోతే మరొక స్పాన్సర్‌ను పట్టుకుందామని చెప్పితే వారికి కమిట్‌మెంట్ ఇచ్చారు. చివరకు వాళ్లు ప్రకటించిన క్యాలెండర్‌లో మన హైదరాబాద్ పేరు లేదు. ఆ తర్వాత వాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. తప్పకుండా మా ప్రభుత్వం వస్తది.. ఆరు నెలల తర్వాత. నేను ప్రయివేటు ప్రమోటర్లను పట్టుకుని.. ఏర్పాట్లు చేస్తాం. తాత్కాలికంగా పైసలు ఇస్తామని మాటిచ్చాను. గవర్నెమెంట్ నుంచి కడుదాం.. మళ్లీ తీసేసుకుందాం అని అరవింద్ కుమార్‌కు చెప్పానని కేటీఆర్ గుర్తు చేశారు.
హెచ్ఎండీఏ 2024 నవంబర్ 14న జీవో ఇచ్చింది. రేస్‌కు సంబంధించి హెచ్ఎండీఏకు సంపూర్ణ అవగాహన ఉంది. కామన్వెల్త్‌కు 70 వేల కోట్లు పెట్టారో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు, ఈవీల్లో టాప్ చాంపియన్ చేసేందుకు ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు కట్టాం. ఇందులో అరవింద్ కుమార్ తప్పు లేదు. మంత్రిగా నేనే సంతకం పెట్టి నిర్ణయం తీసుకున్నా. కేబినెట్ నిర్ణయం లేదు కదా అని అంటున్నారు. హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, జీహెచ్ఎంసీ మూడు విభాగాలు ఇంటర్నల్‌గా డబ్బులను అడ్జస్ట్ చేసుకుంటాయి. ఇది రెగ్యులర్‌గా జరిగే పని. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తది. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపాలిటీ మంత్రి. నా ఆదేశాల మేరకు సెక్రటరీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు.
రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు. చెప్తే వినరు. కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెల్వదు. పాజిటివ్ మనషులు కాదు. పిచ్చోళ్ల లాగా నా మీద కోపంతో రేస్‌ను క్యాన్షిల్ చేశారు. మా కేసీఆర్ గవర్నమెంట్‌లో ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే.. రేవంత్ రెడ్డేమో ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చిండు. ప్రపంచంలో మన పరువు తీసిండు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు వల్ల 800 కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.