కాంగ్రెస్ హనీమూన్ టైమ్ అయిపోయింది..అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:48 PM IST![Telangana, Brs, Congress, Ktr, CM Revanth, Telangana, Brs, Congress, Ktr, CM Revanth,](https://telugu.newsmeter.in/h-upload/2025/02/11/394507-ktr.webp)
కాంగ్రెస్ హనీమూన్ టైమ్ అయిపోయింది..అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పువ్వాడ అజయ్ లాంటి ఉత్సావంతమైన నాయకుడు ఓడిపోతాడని ఎవరం అనుకోలేదు.. ఆయన ఓడిపోవడం నిజంగా బాధాకరమని అన్నారు.
ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక నాయకులు మంత్రులుగా ఉన్నారని.. అయినా జిల్లాలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. వరదల సమయంలో ముగ్గురు మంత్రులతో ఒక్కపైసా ఉపయోగం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఒక్క కుటుంబాన్ని కూడా వరదల నుంచి కాపాడలేకపోయారని అన్నారు. కనీసం హెలికాఫ్టర్ తెప్పించాలనే సోయి కూడా ముగ్గురిలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్ట్ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందని కేటీఆర్ ఆరోపించారు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం 30 శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నట్లు వాళ్ల సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నాడని కేటీఆర్ అన్నారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5 శాతం ఉంటే.. రేవంత్ సర్కార్ చేసిన కులగణన సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46 శాతం బీసీ జనాభాను చూపించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వర్గాన్ని మోసం చేస్తోన్న కాంగ్రెస ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.