రేపు మేము వ‌స్తాం.. మమ్మల్ని కూడా అడ్డుకుంటారా.? : కేటీఆర్

లగచర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  13 Nov 2024 2:44 PM GMT
రేపు మేము వ‌స్తాం.. మమ్మల్ని కూడా అడ్డుకుంటారా.? : కేటీఆర్

లగచర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు మఫ్టీ లో వచ్చి అక్రమంగా కిడ్నాప్ చేసి భయానక వాతావారణం సృష్టించారన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటూ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కేసు ఏందో చెప్పకుండా అరెస్ట్ చేశారు.. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ట పరిస్థితిని తీసుకొచ్చారు. స్థానిక ఎంపీ అయిన డీకే అరుణ ఆ గ్రామానికి వెళ్తానంటే కూడా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కానీ వార్డు మెంబర్ కూడా కానటువంటి కేవలం ముఖ్యమంత్రి అన్న అనే ఒకే అర్హత కలిగినందుకు తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్ల విలేజ్ కు 300 మందితో వెళ్లనిచ్చారు. తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలో తన అనుచరులతో స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే మీ వాళ్లను విడుదల చేస్తామంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరిస్తున్నారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్ర హింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇది. ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారన్నారు. గతంలో ఏ నియంత, అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో చేస్తున్నాడన్నారు.

ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ సహా పోలీసులు గుర్తించాలి. ఓ కారణం చేత మీరు మహబూబ్ నగర్ ఎంపీని వెళ్లకుండా అడ్డుకున్నారు. రేపు మేము కూడా వెళ్తాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా.? అని ప్ర‌శ్నించారు. 144 సెక్షన్ ఉన్నా సరే 300 మందితో తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి భూదాహా యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కాకండని సూచించారు. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకోవటానికి చేస్తున్న ప్రవసనంలో మీరు బలి కాకండన్నారు.

పట్నం నరేందర్ రెడ్డి కుటుంబానికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించేందుకే వచ్చాం. ఒక్క నరేందర్ రెడ్డి మాత్రమే కాదు. పేద రైతులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పార్టీ నేతలమంతా లగచర్ల లకు వెళ్లి వారికి భరోసా ఇస్తామ‌ని తెలిపారు. మేము వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాం. రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలన్నారు. అరెస్ట్ చేసిన రైతులను పోలీసులు చిత్ర హింసలు పెట్టి తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలని డిమాండ్ చేశారు.

రైతులను కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్ర హీనులం అవుతామ‌న్నారు. బీజేపీ, కమ్యూనిస్ట్ సహా అన్ని పార్టీలు స్పందించాలి. లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు. గత 11 నెలలుగా కొడంగల్ లో అరాచక పాలన సాగుతోంది.. ఈ కాంగ్రెస్ వాళ్ల బెదిరింపులకు భయపడాల్సి అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాటింది. ఢిల్లీ వాళ్లకు ఎప్పుడు కోసం వస్తే అప్పుడు ఆయన పదవి ఊడిపోతుందన్నారు.

కొడంగల్ కు సెక్యూరిటీ లేకుండా వస్తే ప్రజలు తంతారని సీఎం కు భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి లు భయపడాలే. ఈ కష్టాలు, ఇబ్బందులు కొన్ని రోజులు మాత్రమే. పదవి శాశ్వతం అనుకోని రేవంత్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలకు మనమే అడ్డుకట్ట వేయాలి.. పోలీసులు అరెస్ట్ చేసిన రైతులకు అండగా ఉంటామ‌న్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తాం. వారికి భరోసా గా ఉంటామ‌న్నారు.

డీజీపీ, పోలీసులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ప్రభుత్వం చేపట్టినట్లు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. చట్ట ప్రకారం రూల్స్ కు అనుగుణంగా పనిచేయండని సూచించారు. అరెస్ట్ ఐన రైతులకు కూడా మేము అండగా ఉంటాం. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదన్నారు. మీడియా కూడా పీడితుల బాధలను చూపించాలి.. పీడితుల వైపు ఉండాలన్నారు.

ఫార్మా విలేజ్ అనే కార్యక్రమం మొదలు పెట్టిన నాటి నుంచే ప్రజలు మా భూములు ఇవ్వమంటూ ఎదురుతిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మాత్రం తన్ని మరీ భూములు తీసుకుంటామని బెదిరించాడు. ఆ ఆడియో కూడా ఉందన్నారు. ఆరు నెలలుగా భూములు ఇవ్వమంటూ రైతులు ఎదురుతిరుగుతున్నారు. ఫార్మా విలేజ్ అన్న నాటి నుంచే ఈ వివాదం కొనసాగుతోంది. కలెక్టరేమో దాడి జరగలేదంటారు. పోలీసులు, ప్రభుత్వం మాత్రం దాడి జరిగిందంటుంది. ఈ ప్రభుత్వానికే స్పష్టత లేదు. డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడుతున్నారన్నారు.

Next Story