కేసీఆరే సీఎం.. నాకంటే సమర్థులు మా పార్టీలో ఎందరో ఉన్నారు : కేటీఆర్

మా పార్టీ అభ్యర్థులను ప్రకటించి 60 రోజులైందని.. బీ ఫామ్స్‌ కూడా దాదాపు ఇచ్చేశామ‌ని.. మంచి మెజారిటీ సాధిస్తామ‌ని

By Medi Samrat  Published on  21 Oct 2023 8:32 PM IST
కేసీఆరే సీఎం.. నాకంటే సమర్థులు మా పార్టీలో ఎందరో ఉన్నారు : కేటీఆర్

మా పార్టీ అభ్యర్థులను ప్రకటించి 60 రోజులైందని.. బీ ఫామ్స్‌ కూడా దాదాపు ఇచ్చేశామ‌ని.. మంచి మెజారిటీ సాధిస్తామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్ ఆయ‌న మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ కు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. బీజేపీ యుద్దానికి ముందే చేతులెత్తేసింది.. అసలు రేసులోనే లేదని అన్నారు. ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు రావని.. కాంగ్రెస్ కు కాంగ్రెస్ చరిత్రే గుదిబండ అని వ్యాఖ్యానించారు. మేము 1.40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని.. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

రాహుల్ ఒక అజ్ఞాని. ఆయ‌న‌కి ఏమీ తెలీదు. సాండ్‌ మాఫియా అని ఆరోపిస్తాడు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా అన్నది రాహుల్ కు తెలీదా అని ప్ర‌శ్నించారు. కింద నుండి మీదికి సూట్ కేసులు మోసేది కాంగ్రెస్ లోనే.. అన్ని మాఫియాలు, స్కామ్ లు కాంగ్రెస్ హయాంలోనే అని ఆరోపించారు. 55 ఏళ్లలో 7,700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే.. అదే మా హయాంలో ఎవరూ ఊహించనంతగా పెంచామ‌న్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ దేన‌న్నారు. విద్య, వైద్యం, సంక్షేమం లో మాకు ఎవరూ పోటీ కాదన్నారు. నెక్స్ట్ టైం తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం తెలుసుకుని మాట్లాడాలని రాహుల్ కు హితవు ప‌లికారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని వెల్ల‌డించారు. మాకు వ్యవసాయంలో సుద్దులు చెప్తే.. హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ లో టాప్ తెలంగాణనేన‌న్నారు.

ప్రజల్లో కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసం ఉందన్నారు. గతంలో ఖమ్మంలో మాకు నాయకులు ఎక్కువ ఉన్నారు.. సీట్లు తక్కువ వచ్చాయి.. ఈసారి అక్కడ నాయకులు పోయారు.. సీట్లు పెరుగుతాయని అన్నారు. మంథని, రామగుండంలో పోటాపోటీ ఉంటుందన్నారు. సీ ఓటర్ సర్వే ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. లాస్ట్ టైమ్ కూడా వాళ్ళు చెప్పింది తప్పయిందన్నారు. ఈసారి అదే రిపీట్ అవుతుందని అన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ(ఖ‌మ్మంలో) ముఖ్యం అన్నదే మా స్టాండ్ అని పేర్కొన్నారు. నల్గొండ లో 12 కు 12 మేమే గెలుస్తామ‌న్నారు. ఫ్లోరోసిస్ ఇచ్చింది కాంగ్రెస్.. దాన్ని రూపుమాపింది బీఆర్ఎస్ అని అన్నారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్గొండ నెంబర్ 1 జిల్లా అని పేర్కొన్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేది మోదీ.. మేమెలా తగ్గిస్తాం? అని ప్ర‌శ్నించారు. ఈసారి బీజేపీ కి 1 సీటు రావొచ్చని జోష్యం చెప్పారు.

ఈటల రాజేందర్ 119 స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి.. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. బుజ్జగింపుల కమిటీకి జానారెడ్డి చైర్మన్ అయినట్టు.. ఈటల పరిస్థితి కూడా ఉందని అన్నారు. నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదా? అని ప్ర‌శ్నించారు.

శివసేన పార్టీ హిందూ పార్టీ అని ఓపెన్ గా ప్రకటించుకుంటోంది. అదే మజ్లిస్ పార్టీ ఎక్కడైనా ముస్లిం పార్టీ అని ప్రకటించుకుందా? అని ప్ర‌శ్నించారు. మజ్లిస్ మాకు కేవలం ఫ్రెండ్లీ పార్టీ నేన‌ని స్ప‌ష్టం చేశారు. మేము ఎవరికీ బీ టీమ్, సీ టీమ్ కాదన్నారు. ఏ టు జెడ్ క‌రెప్ష‌న్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటోంది రేవంత్, కాంగ్రెస్ కాదా.. లేకిగాళ్ళు వచ్చి, మాకు నీతులు చెప్పడమా? అని మండిప‌డ్డారు. దేశంలో బీజేపీని బూచిగా చూపించి, మైనార్టీల ఓట్లు వేయించుకుంటోంది కాంగ్రెస్ కాదా..? అని ప్ర‌శ్నించారు.

జనగామ, స్టేషన్ ఘన్పూర్ లో అసంతృప్తి సద్దుమణిగిందన్నారు. ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతేన‌న్నారు. ఉద్యమకారులు ఆల్రెడీ ఉన్నారు.. ఇంకా వస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన బలిదేవత, ముద్దపప్పుతో కోదండరాం కలిస్తే.. నేనేం చెప్పాలి చెప్పండని ప్ర‌శ్నించారు. TSPSC ద్వారా దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్, బ‌ల్మూరి వెంకట్ కాదా కోర్టులకు వెళ్లి ఆపిందని ప్ర‌శ్నించారు.

'ప్రవళిక' మరణాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే.. మేము మానవీయ కోణంలో ఆదుకున్నామ‌న్నారు. ఈసారి హుజురాబాద్, గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఓడిపోతారని జోష్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరును విమర్శించడానికి మోదీ సహా ఎవరూ సరిపోరన్నారు. మా నాయకుడు కేసీఆరే ఈ రాష్ట్రానికి సీఎం అని.. నాకంటే సమర్థులు మా పార్టీలో కూడా ఎందరో ఉన్నారని అన్నారు.

ఉదయపూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కిన కాంగ్రెస్.. ఈ గ్యారంటీలను తుంగలో తొక్కదనే గ్యారెంటీ ఉందా..? అని సందేహం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. ఎప్పటికీ రీడరే అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే కావొచ్చన్నారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలే సపోర్ట్ చేయొచ్చేమోన‌న్నారు. కేంద్రప్రభుత్వం మొదటి నుంచి మా మెడపై కత్తిపెట్టి ఇబ్బంది పెడుతోందన్నారు.

Next Story