ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
By Knakam Karthik
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం
ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నాయకులతో కలిసి వెళ్లనున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకోవద్దని హరీష్ రావు అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీప్రాంతంలోని దోమలపెంట వద్ద గత శనివారం సొరంగం పనులు జరుగుతుండగా భారీ ప్రమాదం సంభవించి 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్న విషయం తెలిసిందే. సొరంగం ప్రమాదంలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయకచర్యలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇంతకాలం అక్కడికి తాము వెళ్లలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సహాయక చర్యలను పరిశీలించి తమవైపు నుంచి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయటానికి ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారని వివరించారు. తమ పర్యటనకు రాజకీయ ఉద్దేశం ఏమీలేదని స్పష్టం చేశారు.
గల్లంతైన కార్మీకుల ఆచూకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, శిథిలాలు, తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది. సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మీకులు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని, వారు శిథిలాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాను వివరించింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటి రెండురోజుల్లోనే కార్మీకుల ఆచూకీ లభ్యం కావచ్చని భావిస్తున్నారు. తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా నిపుణులు సూచించారు.