గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు లేరు: కేసీఆర్

శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు

By Knakam Karthik
Published on : 27 April 2025 8:05 PM IST

Telangana, Warangal News, Brs, Kcr, Congress Government

గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు లేరు: కేసీఆర్

శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మొదట జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయల్దేరానని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం బయల్దేరిన సమయంలో కొందరు వెటకారం చేశారని, అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని చెప్పారు. ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నామన్నారు. ‘‘1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశాను. కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా తెరాస ఆవిర్భావం జరిగింది. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పాను. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్‌, తెదేపాలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకొని కూర్చున్నారు. శాసనసభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించవద్దని రూలింగ్‌ ఇచ్చారు. తెరాస ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృతమైంది. సాగరహారం, వంటావార్పు, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాం’’ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ విలన్‌ నంబర్‌ 1 అని.. కేసీఆర్‌ విమర్శించారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్‌లాల్‌ నెహ్రూ అయితే, 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశంగా అణచివేసిందని విమర్శించారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజకీయ అవసరం కోసం మన పోరాటానికి భయపడి తెలంగాణను ఇచ్చింది. ప్రజలు మనకు అధికారం ఇస్తే..ఎక్కడో ఉన్న తెలంగాణను చాలా ముందుకు తీసుకెళ్లిపోయాం. పదేళ్లలో అద్భుతమైన పనులు చేసి చూపించాం. ఎన్నో రంగాల్లో తెలంగాణను నంబర్ వన్ చేశాం. తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం.. కాళేశ్వరం కట్టుకున్నాం.. అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం.. రైతుల కోసం రైతుబంధు తీసుకొచ్చాం.. జై జవాన్‌.. జై కిసాన్‌ అన్నారు తప్ప, వాళ్ల సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్‌ హయాంలో 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేశాం.. మిషన్‌ భగీరథ, కేసీఆర్‌ కిట్స్‌, కంటివెలుగు, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎవరూ అడగకపోయినా అమలు చేశాం.. ఐటీ రంగంలోకి కొత్తగా 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గోల్‌మాల్‌ చేయడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు లేరు.. ఏడాదిన్నరగా కాంగ్రెస్‌, ఎన్ని హామీలు ఇచ్చింది.. ఏమి చేసింది? ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి.. డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు..అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Next Story