తెలంగాణ ప్రగతి భవన్‌ను గ్రైనేడ్స్‌తో పేల్చివేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసాన్ని గ్రైనేడ్ పెట్టి పేల్చివేయాల్సిందిగా కోరడం జరిగింది. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి.. అధికార భవనాలను కూల్చివేయాలని కోరడమంటే.. ఖచ్చితంగా అది చట్టవ్యతిరేకగా చర్యగా భావించాలి. కాబట్టి ఆ ప్రసంగాన్ని పరిశీలించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లాలో హత్ సే హాత్ జోడో పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని లోక్‌సభ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ‘‘వందల కోట్లతో కట్టిన కట్టడం వల్ల ముఖ్యమంత్రి లోపల ఉన్నంత కాలం ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఏం ప్రయోజనం? ప్రజలకు ఉపయోగం లేకుంటే ఎలా’’ అని ప్రశ్నించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రగతి భవన్ కట్టారని ఆరోపించిన ఆయన కేసీఆర్ కుటుంబానికి ప్రగతి భవన్ ఎందుకు అని ప్రశ్నించారు.