తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే ఎక్కడో ఒక చోటా మత కల్లోలాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మత కల్లోలం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పని చేయడంలేదని, భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సి రావడం బాధాకరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని, ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారని అన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖం కాదు.. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారని, ప్రతీ మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.