కేసీఆర్ మంచోడు కావొచ్చు, నేను కొంచెం రౌడీ టైప్..ఎవర్నీ వదలను: కవిత
బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
కేసీఆర్ మంచోడు కావొచ్చు, నేను కొంచెం రౌడీ టైప్..ఎవర్నీ వదలను: కవిత
బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వారి పేర్లను బరబార్ పింక్ బుక్‌లో రాసుకుంటాం. నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదు. వాళ్ల తాతలు, ముత్తాలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ..అని కవిత మాట్లాడారు.
మాట తప్పడం, మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి..అని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.