అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం, రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 8 April 2025 4:20 PM IST

Telangana, Brs Mlc Kavitha, Cm Revanthreddy, Congress, Brs

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం, రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావుపూలే విగ్రహ సాధన కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్‌ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో కవిత పాల్గొని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రమాదం ఉందని సీఎం అంటున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అది అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కాదు, అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉంది..అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు...అని కవిత విమర్శించారు.

ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టాం.? మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ? 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో మేము కూడా కలిసి వస్తాం..

కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయము. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలకు కూర్చుందాం. చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైంది. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి? గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా ? బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారు. కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లలేదు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేది. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టండి...ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Next Story